4 స్వర్ణాలు 1 రజతం

12 Nov, 2022 04:46 IST|Sakshi

ఆసియా బాక్సింగ్‌లో భారత మహిళల జోరు  

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్‌ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్‌ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది.  
    
టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్‌)ను చిత్తు చేసింది. ఒలింపిక్‌ పతకం తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్‌ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్‌  63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్‌ 5–0 తేడాతో జపాన్‌ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది.

81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్‌జాన్‌ (కజకిస్తాన్‌)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్‌ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన  ఇస్లామ్‌ హుసైలి తొలి రౌండ్‌లోనే డిస్‌క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్‌) చేతిలో ఓటమిపాలైంది.  
 

మరిన్ని వార్తలు