Asian Indoor Athletics Championships 2023: ‘రికార్డు’తో మెరిసిన జ్యోతి

13 Feb, 2023 05:11 IST|Sakshi

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం

60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డుతో రెండో స్థానం

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా గుర్తింపు  

అస్తానా (కజకిస్తాన్‌): కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్‌లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్‌ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది.

ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. శనివారం జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా... రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్‌; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చెన్‌ జియామిన్‌ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌ లో భారత్‌ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక       కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్‌లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్‌ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు