సెయిలింగ్‌లో సూపర్‌..

27 Sep, 2023 02:57 IST|Sakshi

హాంగ్జౌ: సముద్రంలో తెర చాపను నియంత్రిస్తూ ముందుకు దూసుకుపోవడమే సెయిలింగ్‌. ఆసియా క్రీడల్లో మంగళవారం  ఈ క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. భోపాల్‌కు చెందిన 17 ఏళ్ల నేహా ఠాకూర్‌ బాలికల డింగీ ఐఎల్‌సీఏ–4 ఈవెంట్‌లో రెండో స్థానం సంపాదించి రజత పతకం గెల్చుకుంది. అయోధ్యకు చెందిన 29 ఏళ్ల ఇబాద్‌ అలీ విండ్‌సర్ఫర్‌ ఆర్‌ఎస్‌:ఎక్స్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. 11 రేసులతో కూడిన డింగీ ఈవెంట్‌లో నేహా 32 పాయింట్లు స్కోరు చేయగా... 14 రేసులతో కూడిన విండ్‌సర్ఫర్‌ ఈవెంట్‌లో ఇబాద్‌ అలీ 52 పాయింట్లు సాధించాడు.

భవాని దేవి ఓటమి..
ఆసియా క్రీడల ఫెన్సింగ్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ ఫెన్సర్‌ భవాని దేవి పోరాటం ముగిసింది. మహిళల సేబర్‌ విభాగంలో భవాని దేవి క్వార్టర్‌ ఫైనల్లో 7–15తో యాకి షావో (చైనా) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భవాని గెలిచిఉంటే సెమీఫైనల్‌ చేరడంద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేది.

చేజారిన కాంస్యం..
ఆసియా క్రీడల షూటింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు త్రుటిలో కాంస్యం చేజారింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమితా జిందాల్‌–దివ్యాంశ్‌లతో కూడిన భారత జోడీ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయింది. రమిత–దివ్యాంశ్‌ ద్వయం 18–20తో పార్క్‌ హాజున్‌–లీ ఉన్‌సియో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది.

క్వార్టర్‌ ఫైనల్లో సుమిత్‌ 
ఆసియా క్రీడల టెన్నిస్‌ ఈవెంట్‌ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సుమిత్‌ 7–6 (11/9), 6–4తో బెబిట్‌ జుకయెవ్‌ (కజకిస్తాన్‌)పై, అంకిత 6–1, 6–2తో ఆదిత్య పటాలి (హాంకాంగ్‌)పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు