రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం

23 Apr, 2022 08:01 IST|Sakshi
భారత మహిళా రెజ్లర్‌ అన్షు మాలిక్‌

Asian Wrestling Championship- ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌ మహిళల విభాగంలో శుక్రవారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ అన్షు మలిక్‌ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్‌ (జపాన్‌)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది.

అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్‌లలో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్‌)పై... డానియెలా స్యు చింగ్‌ లిమ్‌ (సింగపూర్‌)పై, బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో బౌట్‌లు నిర్వహించారు. భారత రెజ్లర్‌ రాధిక మూడు బౌట్‌లలో గెలిచి, ఒక బౌట్‌లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్‌బిట్‌ లీ (కొరియా)పై గెలిచింది.

చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్‌ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ..

మరిన్ని వార్తలు