‘టోక్యో’ ఈవెంట్‌ను కెరీర్‌ బెస్ట్‌గా మలచుకుంటా 

23 Sep, 2020 02:57 IST|Sakshi

భారత స్టార్‌ ఆర్చర్‌ అతాను దాస్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఆర్చర్‌ అతాను దాస్‌ వచ్చే ఏడాది జరిగే ‘టోక్యో ఒలింపిక్స్‌’ను తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా మలచుకుంటానని చెప్పాడు. గత రియో ఒలింపిక్స్‌లో సాధారణ ప్రదర్శనతో తేలిపోయిన అతను టోక్యో క్రీడల కోసం పట్టుదలతో సిద్ధమయ్యానని చెప్పాడు. లైవ్‌ చాట్‌లో ఆర్చర్‌ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌పై ఎక్కడలేని ఆసక్తి కనబరిచాను. అది నా తొలి మెగా ఈవెంట్‌. అయినాసరే నేను నా శక్తిమేర రాణించాను. ఉత్తమ ప్రదర్శనే ఇచ్చాను. కానీ దురదృష్టవశాత్తు క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాను. దీంతో నిరాశ చెందాను. దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడేవాణ్ని కాదు. మెల్లిగా ఆ ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నాను. నా లోటుపాట్లేంటో బాగా తెలుసుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాను. సానుకూల దృక్పథం కోసం మంచి ఆలోచనలే చేయాలనుకున్నాను’ అని వివరించాడు. ‘రియో’ నైరాశ్యం అధిగమించేందుకు తాను మానసిక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చాడు. 2006లో ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్న తనకు మరుసటి ఏడాది టాటా అకాడమీలో శిక్షణ కోసం వెళితే తిరస్కరణ ఎదురైందని దీంతో మరింత కష్టపడి పట్టుదలగా ప్రాక్టీస్‌ చేశానని చెప్పాడు. ఆరు నెలల వ్యవధిలో సబ్‌–జూనియర్‌ జాతీయ పోటీల్లో రికర్వ్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలవడంతో టాటా అకాడమీ ఎంపిక చేసుకుందని అనాటి విషయాల్ని అతాను దాస్‌ వివరించాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా