బ‌య‌ట‌ప‌డ్డ జాతీయ క్రీడా సంస్థ డొల్లతనం

9 Sep, 2020 10:12 IST|Sakshi

  క్రీడల మంత్రికి హిమ దాస్‌ ఫిర్యాదు 

న్యూఢిల్లీ : పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడాసంస్థ (ఎన్‌ఎస్‌–ఎన్‌ఐఎస్‌) డొల్లతనం బ‌య‌ట‌పడింది. ఇటీవలే అక్కడి సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు రాగా... తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది. భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఆహారం నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్‌ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్‌ఐఎస్‌ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట. (నా మనసు చెబుతోంది అది కుట్రేనని...)

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్‌ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ‘ఎన్‌ఐఎస్‌ భోజనశాలలో అపరిశుభ్రత, ఆహారం నాసిరకంగా ఉండటంపై అథ్లెట్లు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకున్నాం. అథ్లెట్లు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా వారికి అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై సూచనలు జారీ చేశాం. ఇప్పుడు వారికి అందుతున్న ఆహారం పట్ల అథ్లెట్లు కూడా సంతోషంగా ఉన్నారు’ అని ‘సాయ్‌’ పేర్కొంది. (ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం)

మరిన్ని వార్తలు