Aaron Finch: అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్‌ ఫించ్‌.. వీడియో వైరల్‌

11 Oct, 2022 09:36 IST|Sakshi

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ను ఐసీసీ మందలించింది. మ్యాచ్‌ సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఫించ్‌ను హెచ్చరించినట్లు ఐసీసీ పేర్కొంది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో ఫించ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కామెరున్‌ గ్రీన్‌ వేసిన బంతిని బట్లర్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్‌ అయి కీపర్‌ వేడ్‌ చేతుల్లోకి వెళ్లింది.

ఆసీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. దీంతో కెప్టెన్‌ ఫించ్‌ అంపైర్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ కింద లెవెల్‌-1 నిబంధన ఉల్లఘించినట్లు ఐసీసీ పేర్కొంది.  ఆర్టికల్‌ 2.3 ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో అసభ్యకర వ్యాఖ్యలను చేయడం నిబంధన ఉల్లఘించడం కిందే వస్తుందని.. అందుకే ఫించ్‌కు జరిమానా కాకుండా కేవలం హెచ్చరికతో వదిలిపెట్టామని వెల్లడించింది. మరోసారి ఇదే రిపీట్‌ చేస్తే మ్యాచ్‌ నిషేధంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఐసీసీ హెచ్చరిక కారణంగా డీమెరిట్‌ కింద ఫించ్‌కు ఒక పాయింట్‌ కోత పడింది. 

ఇక తొలి మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ చేసిన ఇంగ్లండ్‌ ఎట్టకేలకు గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్‌ హేల్స్‌ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరలెవెల్లో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్‌ మార్ష్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్‌ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్‌ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే ఆఖర్లో మార్క్‌ వుడ్‌ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్‌ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

చదవండి: ఉతికారేసిన బట్లర్‌, హేల్స్‌.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా

మరిన్ని వార్తలు