Ashes: ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఘోర పరాభవం.. హెడ్‌కోచ్‌పై వేటు.. మాజీ కెప్టెన్‌కు కీలక బాధ్యతలు!

4 Feb, 2022 11:59 IST|Sakshi
PC: ECB

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌పై వేటు పడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ‍్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది. ఇక సిల్వర్‌వుడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకంగా వ్యవహరించిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గిల్స్‌ తన పదవి నుంచి దిగిపోయిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. 

కాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో జో రూట్‌ బృందం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 0-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుని అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో కెప్టెన్‌ రూట్‌, కోచ్‌ సిల్వర్‌వుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మేనేజ్‌మెంట్‌ తీరును కూడా పలువురు దిగ్గజాలు విమర్శించారు. ఈ క్రమంలో ఎండీ, హెడ్‌​కోచ్‌ తమ పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. 

ఈ సందర్భంగా సిల్వర్‌వుడ్‌ మాట్లాడుతూ... ‘‘ఇంగ్లండ్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేటి ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి ప్రయాణించడం నాకు గర్వకారణం. గడిచిన రెండేళ్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే రూటీ(టెస్టు కెప్టెన్‌ జో రూట్‌), మోర్గ్స్‌(పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌)తో కలిసి పనిచేయడం... కఠిన సవాళ్లను ఎదుర్కోవడం పట్ల గర్వంగా ఉంది.

కోచ్‌గా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఎండీ ఆష్లే స్థానంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. టెస్టు సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో కేర్‌ టేకర్‌ కోచ్‌ను అతడు నియమించనున్నాడు.  

చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. భార‌త అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌

మరిన్ని వార్తలు