WTC 2021-23: క్యారీ తొలి సెంచరీ.. ఆసీస్‌ భారీ స్కోరు.. చతికిల పడ్డ ప్రొటిస్‌! మరోసారి..

28 Dec, 2022 13:33 IST|Sakshi
ఎల్గర్‌ వికెట్‌ తీసిన ఆనందంలో ప్యాట్‌ కమిన్స్‌

Australia vs South Africa, 2nd Test Day 3 Highlights: ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలిచేందుకు కీలకమైన సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడింది ప్రొటిస్‌. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆసీస్‌ చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.

మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సరికి 371 పరుగుల వెనుకబడి ఉంది. కాగా సోమవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ను ఆల్‌రౌండర్‌ను కామెరాన్‌ గ్రీన్‌ దెబ్బకొట్టాడు. 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు.

189కే ఆలౌట్‌
ఈ క్రమంలో 189 పరుగులకు ఆలౌట్‌ అయిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (200), స్టీవ్‌ స్మిత్‌(85) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. ట్రవిస్‌ హెడ్‌(51), గ్రీన్‌(51- నాటౌట్‌) రాణించారు.

ఇక అలెక్స్‌ క్యారీ టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ(111)తో మెరిశాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 575 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ప్రొటిస్‌ బౌలర్లలో రబడకు రెండు, నోర్జేకు మూడు వికెట్లు దక్కగా.. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

కెప్టెన్‌ మరోసారి విఫలం
ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ప్రొటిస్‌ కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ మరోసారి విఫలమయ్యాడు. ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. 

ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టానికి సౌతాఫ్రికా 17 పరుగులు చేసింది. ఓపెనర్‌ సారెల్‌ ఎర్వీ(7),  థీనిస్ డి బ్రూయిన్ (6) క్రీజులో ఉన్నారు. కాగా ఎల్గర్‌ తొలి ఇన్నింగ్‌స్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ అయ్యాడు.

మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు:
ఆస్ట్రేలియా- 575/8 d
సౌతాఫ్రికా- 189 & 15/1 (7) 

చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్‌ వెళ్లి ఆడుకో​! ఇక్కడుంటే..
Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్‌ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్‌!

మరిన్ని వార్తలు