శతకాల మోత మోగించిన ఆసీస్‌ ప్లేయర్లు.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు

5 Jan, 2023 11:07 IST|Sakshi

AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. రెండో రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు ఉస్మాన్‌ ఖ్వాజా (335 బంతుల్లో 172 నాటౌట్‌) కెరీర్‌లో 13 శతకం బాది డబుల్‌ సెంచరీ దిశగా సాగుతుండగా, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కెరీర్‌లో 30 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట కేవలం 47 ఓవర్లు మాత్రమే సాగగా.. ఇవాల్టి (జనవరి 5) ఆట షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభమైంది. టీ విరామం సమయానికి ఖ్వాజాకు జతగా ట్రావిస్‌ హెడ్‌ (17) క్రీజ్‌లో ఉన్నాడు. అచొచ్చిన సిడ్నీ గ్రౌండ్‌లో ఖ్వాజా (ఈ గ్రౌండ్‌లో ఇదివరకే 3 సెంచరీలు బాదాడు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. సఫారీ బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఖ్వాజా తన టెస్ట్‌ కెరీర్‌లో నాలుగోసారి 150 మార్కును క్రాస్‌ చేయగా.. స్టీవ్‌ స్మిత్‌ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌.. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్‌ సిరీస్‌ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి.  
 

మరిన్ని వార్తలు