AUS VS SA 3rd Test: విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం​ మాత్రం కాదు..!

8 Jan, 2023 07:45 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్‌.. ఆఖరి రోజు లంచ్‌ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్‌ హార్మర్‌ (45 నాటౌట్‌), కేశవ్‌ మహారాజ్‌ (49 నాటౌట్‌) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్‌ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్‌ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 475/4 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్‌ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

ఈ క్రమంతో ఉస్మాన్‌ ఖ్వాజా (195 నాటౌట్‌) డబుల్‌ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్‌ కెప్టెన్‌ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఖ్వాజాతో పాటు స్టీవ్‌ స్మిత్‌ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్‌ (79), ట్రవిస్‌ హెడ్‌ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

మరిన్ని వార్తలు