Aus Vs SA 2nd Test: తొందరెందుకు? క్రీజులో ఉండు డ్యూడ్‌.. స్టార్క్‌ వార్నింగ్‌! వీడియో

29 Dec, 2022 14:14 IST|Sakshi

Australia vs South Africa, 2nd Test: ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాను బాల్‌ వేసేకంటే ముందే క్రీజు దాటేందుకు ప్రయత్నించిన ప్రొటిస్‌ బ్యాటర్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌. రనౌట్‌(మన్కడింగ్‌) ప్రమాదాన్ని గుర్తు చేస్తూ క్రీజులో ఉండాలి కదా అంటూ హితవు పలికాడు.

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో తెంబా బవుమా క్రీజులో ఉన్నాడు. మూడో బంతి సంధించిన తర్వాత మరో డెలివరీకి సిద్ధమవుతున్న స్టార్క్‌.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ థీనిస్‌ డి బ్రూయిన్‌ క్రీజు వీడటాన్ని గమనించాడు.

క్రీజులో ఉండు
వెంటనే వెనక్కి వచ్చి అతడిని హెచ్చరించాడు. ‘‘క్రీజులో ఉండు. రూల్స్‌ ఉన్నది ఎందుకు? క్రీజులోనే ఉండు డ్యూడ్‌’’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఓవర్లో బవుమా ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.

దీంతో పరుగు తీద్దామన్న ఆసక్తితో ఉన్న బ్రూయిన్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వీడియోపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబరులో టీమిండియా బౌలర్‌ దీప్తి శర్మను ఉద్దేశించి స్టార్క్‌ విమర్శలు సంధించిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ మహిళా బ్యాటర్‌ చార్లీ డీన్‌ రనౌట్‌(మన్కడింగ్‌) చేయడంపై ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్కడింగ్‌ చేయడాన్ని రనౌట్‌గా పరిగణిస్తూ నిబంధనలు వచ్చినా.. దీప్తిని చాలా మంది తప్పుబట్టారు.

అపుడు దీప్తి శర్మను ఉద్దేశించి..
ఈ నేపథ్యంలో స్టార్క్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా నాన్‌ స్ట్రైకర్‌ జోస్‌ బట్లర్‌ను రనౌట్‌ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. అంతేగాక నేనేమీ దీప్తిని కాదంటూ వ్యాఖ్యానించి టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక తాజాగా మరోసారి బ్యాటర్‌ను అవుట్‌ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. దీంతో కొంతమంది అతడి చర్యను సమర్థిస్తున్నారు.

మరికొందరు మాత్రం రూల్స్‌ పాటించడంలో తప్పు లేదని, స్టార్క్‌.. నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకోనంత మాత్రాన ఇతరులను విమర్శించే హక్కు మాత్రం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.  దీప్తి శర్మ విషయంలో అతడి వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇన్నింగ్స్‌ మీద 182 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. బాక్సింగ్‌ డే టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది.

చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం!
IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్‌ ఘాటు వ్యాఖ్యలు
Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్‌.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ఇక..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు