IND VS AUS: వార్మప్‌ మ్యాచ్‌ ఆడి వరల్డ్‌కప్‌ గెలవలేము కదా.. ఆసీస్‌ కెప్టెన్‌ వ్యంగ్యం

17 Oct, 2022 20:48 IST|Sakshi

టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 17) జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అఖరి ఓవర్‌ వరకు ఇరు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉండాయి. అయితే, ఆఖరి ఓవర్‌లో షమీ మ్యాజిక​్‌ చేసి మ్యాచ్‌ను ఆసీస్‌ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. గెలుపుకు 11 పరుగులు కావల్సిన తరుణంలో షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌కు విజయాన్నందించాడు. తొలి రెండు బంతులకు 4 పరుగులిచ్చిన అతను.. ఆఖరి 4 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని ఒంటిచేత్తో ఓడించాడు.  

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో ఆసీస్‌ ఆది నుంచే చెలరేగినప్పటికీ.. ఆఖరి ఓవర్‌లో షమీ వారిని దారుణంగా దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ ఫించ్‌ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. స్మిత్‌, మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (35), మ్యాక్స్‌వెల్‌ (23) మినహా జట్టు మొత్తం విఫలమైంది. 

కాగా, ఈ మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఫించ్‌.. టీమిండియా గెలుపుపై స్పందిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. తొలుత తన ఇన్నింగ్స్‌ సంతృప్తినిచ్చిందని డబ్బా కొట్టుకున్న అతను.. టీమిండియా సాధించిన విజయాన్ని లైట్‌గా తీసుకున్నాడు. తాము గెలిచి ఉంటే బాగుండేది అని అంటూనే.. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడి వరల్డ్‌కప్‌ గెలవలేము కదా అంటూ పరోక్షంగా భారత విజయాన్ని చులకన చేశాడు. ఈ అంశంపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. 

మరిన్ని వార్తలు