‘స్టిక్‌’ సీన్‌ మారింది...

6 Aug, 2021 05:50 IST|Sakshi
గ్రాహం రీడ్‌

మాట నిలబెట్టుకున్న కోచ్‌ గ్రాహం రీడ్‌

సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్‌ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్‌ గ్రాహం రీడ్‌ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు.

పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్‌ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్‌ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్‌ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే.

ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్‌దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్‌ కల్పించాడు. కోచింగ్‌ క్యాంప్‌లో రీడ్‌ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్‌ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్‌. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్‌ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్‌ తత్వం అందరికీ మేలు చేసింది.  

ఫిట్‌నెస్‌ సూపర్‌...
సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్‌ సంకల్పించాడు. స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లతో పాటు సైంటిఫిక్‌ అడ్వైజర్‌ రాబిన్‌ అర్కెల్‌ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్‌ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్‌నెస్‌ను చూపించింది.

రీడ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్‌ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్‌ చేసింది. ఇక సబ్‌స్టిట్యూట్‌లను సమర్థంగా వాడుకోవడం రీడ్‌ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్‌ చేశాడు. అమిత్‌ రోహిదాస్‌ ‘ఫస్ట్‌ రషర్‌’ రూపంలో శ్రీజేశ్‌కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది.  

మరిన్ని వార్తలు