టీమిండియాకు తొలి ఓటమి

21 Jan, 2023 21:45 IST|Sakshi

ICC U19 Womens T20 World Cup: ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2023లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్‌ దశలో 3 మ్యాచ్‌ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా.. సూపర్‌ సిక్స్‌ గ్రూప్‌-1లో భాగంగా ఇవాళ (జనవరి 21) ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలై, సెమీస్‌ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలగా, ఆసీస్‌ 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. భారత ఇన్నింగ్స్‌లో శ్వేత సెహ్రావత్‌ (21) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హ్రిషిత బసు (14), టిటాస్‌ సాధు (14)లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

ఆసీస్‌ బౌలర్లలో సియన్నా జింజర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌, మ్యాగీ క్లార్క్‌ తలో 2 వికెట్లు, కెప్టెన్‌ రైస్‌ మెక్‌కెన్నా, ఎల్లా హేవర్డ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో క్లెయిర్‌ మూర్‌ (25), ఆమీ స్మిత్‌ (26) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో టిటాస్‌ సంధూ, అర్చనా దేవీ, సోనమ్‌ యాదవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

సూపర్‌ సిక్స్‌ గ్రూప్‌-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ జట్టు ఉన్నాయి. గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, రువాండ, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. భారత్‌.. తమ తదుపరి మ్యాచ్‌లో రేపు (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది. కాగా, మహిళ అండర్‌-19 విభాగంలో టీ20 వరల్డ్‌కప్‌ జరగడం ఇదే తొలిసారి.   


 

మరిన్ని వార్తలు