టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు సమం

2 Oct, 2023 17:28 IST|Sakshi

అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు సమం అయ్యింది. వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, అప్పటివరకు సోల్‌గా ఫాస్టెస్ట్‌ టీ20 హాఫ్‌ సెంచరీ రికార్డును హోల్డ్‌ చేసిన కివీస్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్‌ సరసన చేరింది.

2015 ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సోఫీ కూడా 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్‌ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌కు ముందు ఎల్లిస్‌ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు అర్ధసెంచరీతో మెరవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఆఖర్లో జార్జియా వేర్హమ్‌ (13 బంతుల్లో 32 నాటౌట్‌; 6 ఫోర్లు) కూడా చెలరేగడంతో ఆసీస్‌ 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు బెత్‌ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్‌లాండ్‌ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. విండీస్‌ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ 3, షమీలియా కొన్నెల్‌ 2, చినెల్‌ హెన్రీ ఓ వికెట్‌ పడగొట్టారు.   

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి వృధా..
ఆసీస్‌ ప్లేయర్‌ లిచ్‌ఫీల్డ్‌ టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టితో చెలరేగినప్పటికీ విండీస్‌పై ఆసీస్‌ విజయం సాధించలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ సూపర్‌ సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మాథ్యూస్‌కు జతగా స్టెఫానీ టేలర్‌ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో విండీస్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా విండీస్‌ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది.

ఆసీస్‌ బౌలర్లలో మెగన్‌ షట్‌ 2, జొనాస్సెన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్‌, రెండో మ్యాచ్‌లో విండీస్‌ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 అక్టోబర్‌ 5న జరుగుతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ అనంతరం వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. 

మరిన్ని వార్తలు