Women World Cup 2022 Winner: ఏడోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

4 Apr, 2022 05:57 IST|Sakshi
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ ‘టోర్నీ’ అవార్డులతో అలీసా

ఏడోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ సొంతం

ఫైనల్లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల తేడాతో ఘనవిజయం

అలీసా హీలీ అద్భుత సెంచరీ

నటాలీ సివెర్‌ వీరోచిత శతకం వృథా

మహిళల క్రికెట్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి ఆద్యంతం దూకుడును కొనసాగించిన ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో విజయంతో ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించింది.

క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియా జోరు ముందు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ నిలబడలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి ఏడోసారి విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీతెర్‌ నైట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది.

ఆసీస్‌ ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్‌ హేన్స్‌ ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ముఖ్యంగా అలీసా హీలీ (138 బంతుల్లో 26 ఫోర్లతో 170) తన కెరీర్‌లోనే గొప్ప ఇన్నింగ్స్‌ ఆడింది.  రాచెల్‌ హేన్స్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద... అలీసా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్‌ ఫీల్డర్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్లో ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌లో రాచెల్‌ హేన్స్‌ (93 బంతుల్లో 68; 7 ఫోర్లు) అవుటవ్వడంతో 160 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

రాచెల్‌ అవుటయ్యాక వచ్చిన బెత్‌ మూనీ (47 బంతుల్లో 62; 8 ఫోర్లు) కూడా కదంతొక్కడంతో ఆసీస్‌ స్కోరు బోర్డు పరుగెత్తింది. అలీసా, బెత్‌ మూనీ రెండో వికెట్‌కు 156 పరుగులు జత చేయడంతో ఆసీస్‌ స్కోరు 300 పరుగులు దాటింది. అలీసా ‘డబుల్‌ సెంచరీ’ ఖాయమనుకుంటున్న దశలో ష్రుబ్‌షోల్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నటాలీ సివెర్‌ (121 బంతుల్లో 148 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత ఆటతో అజేయ సెంచరీ సాధించినా ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.

టామీ బీమోంట్‌ (27; 5 ఫోర్లు), హీతెర్‌ నైట్‌ (26; 4 ఫోర్లు), సోఫీ డంక్లే (22; 1 ఫోర్‌) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో ఇంగ్లండ్‌ లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఆసీస్‌ బౌలర్లలో అలానా కింగ్‌ (3/64), జెస్‌ జొనాసెన్‌ (3/57) రాణించారు. టోర్నీ మొత్తంలో 509 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అలీసా హీలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డులు లభించాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్‌ ఇంగ్లండ్‌కు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

► ఒకే ప్రపంచకప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో (సెమీఫైనల్, ఫైనల్‌) సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌ అలీసా. గతంలో పురుషుల క్రికెట్‌లో పాంటింగ్‌ (ఆస్ట్రేలియా; 2003 ఫైనల్, 2011 క్వార్టర్‌ ఫైనల్‌), జయవర్ధనే (శ్రీలంక; 2007 సెమీఫైనల్, 2011 ఫైనల్‌) వేర్వేరు ప్రపంచకప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు.

► పురుషుల, మహిళల ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అలీసా హీలీ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో 2007 పురుషుల ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (149) స్కోరును అలీసా అధిగమించింది.

► ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్‌ టోర్నీలు జరగ్గా... ఫైనల్‌ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే.  

► ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచకప్‌ టైటిల్స్‌. గతంలో ఆసీస్‌ 1978, 1982, 1988, 1997, 2005, 2013లలో కూడా విజేతగా నిలిచింది.

మరిన్ని వార్తలు