AUS VS NZ 3rd ODI: స్మిత్‌ సూపర్‌ సెంచరీ.. కివీస్‌ను ఊడ్చేసిన ఆసీస్‌

11 Sep, 2022 18:26 IST|Sakshi

స్వదేశంలో కివీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆదివారం (సెప్టెంబర్‌ 11) జరిగిన మూడో వన్డేలో స్టీవ్‌ స్మిత్‌ (105)  సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ 25 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. స్మిత్‌ సెంచరీ, మార్నస్‌ లబూషేన్‌ (52), అలెక్స్‌ క్యారీ (42 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల చేసింది. ఆఖర్లో కెమరూన్‌ గ్రీన్‌ (12 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 2, సౌథీ, ఫెర్గూసన్‌, సాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కివీస్‌ మరో బంతి మిగిలుండగానే 242 పరుగల వద్ద ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ (35), గ్లెన్‌ ఫిలిప్‌ (47), జేమ్స్‌ నీషమ్‌ (36), మిచెల్‌ సాంట్నర్‌ (30) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  

ఆసీస్‌ బౌలర్ల ఏ ఓక్క బ్యాటర్‌ను కుదురుకోనివ్వలేదు. సీన్‌ అబాట్‌ (2/31), కెమరూన్‌ గ్రీన్‌ (2/25) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కివీస్‌పై ఒత్తిడి పెంచారు. ఆఖర్లో స్టార్క్‌ (3/60) చెలరేగి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. హేజిల్‌వుడ్‌, జంపా తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ, సెంచరీతో రాణించిన స్టీవ్‌ స్మిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు దక్కాయి. కాగా, సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఆసీస్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆసీస్‌ తదుపరి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.    
చదవండి: స్మిత్‌.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు!

మరిన్ని వార్తలు