156 పరుగులు చేసి.. 106 పరుగులకే కూల్చేశారు!

5 Mar, 2021 15:48 IST|Sakshi

వెల్టింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో ఆసీస్‌ విజయం సాధించింది. మూడో టీ20ని గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆసీస్‌ అదే జోరును నాల్గో టీ20లో కనబరిచి గెలుపును అందుకుంది. ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 156 పరుగులే చేసినా, న్యూజిలాండ్‌ను 18.5 ఓవర్లలో 106 పరుగులకే కూల్చేసి 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్‌ బౌలింగ్‌ విభాగంలో సమష్టిగా రాణించి బ్లాక్‌క్యాప్స్‌ను కట్టడి చేశారు. కివీస్‌ ఆటగాళ్లలో కేల్‌ జెమీసన్‌(30; 5 ఫోర్లు 18 బంతుల్లో) మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్‌ బౌలర్లలో  కేన్‌ రిచర్డ్‌సన్‌ మూడు వికెట్లు సాధించగా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా, ఆస్టన్‌ ఆగర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టులో కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఫించ్‌ 55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరును చేయగల్గింది. ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ ప్రస్తుతానికి సమంగా నిలిచింది. తొలి రెండు టీ20లను న్యూజిలాండ్‌ గెలిచిన సంగతి తెలిసిందే. సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 ఇదే వేదికపై ఆదివారం జరుగనుంది. 

ఇక్కడ చదవండి: ఒకే దెబ్బకు రోహిత్‌ శర్మ రెండు రికార్డులు

మరిన్ని వార్తలు