ఆసీస్‌ మహిళలదే సిరీస్‌

6 Oct, 2020 05:18 IST|Sakshi

మెగ్‌ లానింగ్‌ అజేయ శతకం

రెండో వన్డేలోనూ కివీస్‌పై గెలుపుతో వరుసగా 20వ విజయం

బ్రిస్బేన్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా అత్యధిక వన్డేలు (21) గెలిచిన తమ పురుషుల జట్టు రికార్డును సమం చేసేందుకు ఆస్ట్రేలియా మహిళల టీమ్‌ మరింత చేరువైంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ మహిళల టీమ్‌పై విజయం సాధించింది. ఆసీస్‌కు ఇది వరుసగా 20వ వన్డే విజయం కావడం విశేషం. 2003లో రికీ పాంటింగ్‌ నాయకత్వంలోని కంగారూ జట్టు వరుసగా 21 వన్డేలు గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (115 బంతుల్లో 79; 7 ఫోర్లు), అమేలీ సాటర్‌వైట్‌ (73 బంతుల్లో 69; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. జెస్‌ జొనాసెన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్‌ 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (96 బంతుల్లో 101 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అజేయ శతకం సాధించగా, రాచెల్‌ హేన్స్‌ (89 బంతుల్లో 82; 13 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించింది. లానింగ్‌కు ఇది 14వ వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ గెలుపుతో ఆసీస్‌ మహిళల జట్టు మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు