AUS Vs SL 5th ODI: చివరి వన్డేలో ఆసీస్‌ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్‌ కృతజ్ఞతలు

24 Jun, 2022 21:52 IST|Sakshi

శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పటికే లంక వరుసగా మూడు వన్డేలు గెలవడంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. 1992 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై శ్రీలంక వన్డే సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్‌ క్రికెట్‌ ఆడేందుకు రావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది.

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్ద మనసుతో లంక పర్యటనకు రావడం కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు. ఇక లంక జట్టు టి20 సిరీస్‌ కోల్పోయినప్పటికి.. వన్డే సిరీస్‌ను మాత్రం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక అభిమానులు కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. చివరి వన్డే సందర్భంగా హాజరైన ప్రేక్షకులు ''లంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా'' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. 


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక ఒక దశలో 85 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో చమీర కరుణరత్నే 75 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి ప్రమోద్‌ మధుసూదన్‌ 15 పరుగులతో సహకరించాడు. కాగా లంక 43.1 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. కరుణరత్నేవి 75 పరుగులు ఉండడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా కూడా మొదట్లో తడబడింది. డేవిడ్‌ వార్నర్‌(10), ఆరోన్‌ ఫించ్‌(0), జోష్‌ ఇంగ్లిష్‌(5) తొందరగానే వెనుదిరగడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్‌ మార్ష్‌ (24 పరుగులు), మార్నస్‌ లబుషేన్‌(31 పరుగులు) ఆదుకున్నారు. ఆ తర్వాత అలెక్స్‌ క్యారీ 45 నాటౌట్‌, కామెరున్‌ గ్రీన్‌ 25 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి:  సిక్సర్‌తో పంత్‌ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా!

Daryl Mitchell: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్‌ బ్యాటర్‌.. దిగ్గజాల సరసన చోటు

మరిన్ని వార్తలు