'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌ది'

9 Jan, 2021 18:30 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌  ఫీల్డ్‌ అంపైర్‌ విల్సన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సమయంలో చతేశ్వర్ పుజారా ఔట్ అంటూ టిమ్ పైన్ డీఆర్‌ఎస్ కోరాడు‌. అయితే నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్ విల్సన్‌తో వాదనకి దిగాడు. తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన విల్సన్.. టిమ్ పైన్‌ నోరు జారడంతో విల్సన్‌ కూడా సీరియస్‌గానే బదులిచ్చాడు. (చదవండి: ఒకవేళ అక్కడ సచిన్‌ ఉంటే పరిస్థితి ఏంటి?)

ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా.. బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్‌ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్‌గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో ఆసీస్‌ కెప్టెన్ టిమ్ పైన్‌ డీఆర్‌ఎస్ కోరాడు.(చదవండి: వాటే సెన్సేషనల్‌ రనౌట్‌..!)

అయితే రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్‌లో ఎక్కడా కనిపించలేదు. దాంతో థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా సహనం కోల్పోయిన పైన్‌ అసహనం వ్యక్తం చేస్తూ బూతులందుకున్నాడు. పైన్‌ మాటలు విన్న అంపైర్ విల్సన్ 'ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ తీసుకున్నాడు నేను కాదు' అంటూ కోపంగా బదులిచ్చాడు.

మరిన్ని వార్తలు