-

పాపం లాంగర్‌.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది

19 Jan, 2021 17:10 IST|Sakshi

బ్రిస్బేన్‌: గబ్బా వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ విధించిన 328 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్  7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా టీమిండియాను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా)

'ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్‌ స్టాండింగ్‌ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చింది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్‌ టెస్టు సిరీస్‌ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్‌ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్‌కున్న విలువేంటో మరోసారి కనిపించింది. (చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు )

రిషబ్‌ పంత్‌ లాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్‌ సాగించిన ఇన్నింగ్స్‌ చూస్తే.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ కూడా మంచి బ్యాటింగ్‌ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌కు టెస్టు క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంది.'అని చెప్పుకొచ్చాడు. లాంగర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా మ్యాచ్‌ గెలిచాకా లాంగర్‌కు విషయం అర్థమయినట్లుంది అంటూ కామెంట్స్‌ జతచేశారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు