ఏడేళ్ల తర్వాత మళ్లీ రికార్డు బ్యాటింగ్‌

29 Nov, 2020 15:27 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 66 పరుగులు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 374 పరుగులు చేయగా, టీమిండియా 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ నమోదు చేసిన 374 పరుగుల స్కోరు వారికి భారత్‌పై అత్యధిక వన్డే స్కోరుగా నమోదైంది. కాగా, ఆ రికార్డు సాధించిన రెండు రోజుల్లోనే ఆసీస్‌ దాన్ని బ్రేక్‌ చేసింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ బ్యాట్‌ ఝుళిపించి  389 పరుగులు సాధించి కొత్త రికార్డును లిఖించింది. వార్నర్‌(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్‌(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ‌), స్టీవ్‌ స్మిత్‌(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), లబూషేన్‌(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్‌ రికార్డు స్కోరు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌-ఫించ్‌లు దాటిగా ఆరంభించారు.  ఈ జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు తిరుగులేకుండా పోయింది. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఫ్రీగా బ్యాటింగ్‌ చేసి పరుగులు వరద పారించారు. ఇక ఆసీస్‌ వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఐదుగురు ఆటగాళ్లు 50కి పైగా పరుగులు నమోదు చేయడం భారత్‌పై ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013లో జైపూర్‌లో జరిగిన వన్డేలో ఆసీస్‌ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇలానే 50కి పైగా పరుగులు సాధించారు.  ఆ తర్వాత ఇంతకాలానికి ఆ అరుదైన ఘనతను ఆసీస్‌ మళ్లీ సాధించింది.

మరిన్ని వార్తలు