Border-Gavaskar Trophy 2020-21: కష్టపడింది నేనైతే.. క్రెడిట్ మరొకరికా..? అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు

10 Feb, 2022 15:49 IST|Sakshi

Ajinkya Rahane: ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతూ, వైస్‌​ కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో స్థానాన్ని సైతం ప్రశ్నార్ధకంగా మార్చుకున్న టీమిండియా టెస్ట్‌ ఆటగాడు అజింక్య రహానే.. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కష్టపడి టీమిండియాను గెలిపించింది నేనైతే.. క్రెడిట్‌ మరొకరికి దక్కిందంటూ నాటి జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిని ఉద్దేశిస్తూ వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తే.. ఫలితాన్ని మరొకరు ఆపాదించుకున్నారని, ఆన్‌ ఫీల్డ్‌లో నేను తీసుకున్న సొంత నిర్ణయాలను కొందరు తమవిగా చెప్పుకున్నారని వాపోయాడు. ఈ సందర్భంగా తన ఫామ్‌పై వస్తున్న విమర్శలపై కూడా రహానే తనదైన శైలిలో స్పందించాడు. తన పని అయిపోయిందంటూ వస్తున్న వార్తలు చూసినప్పుడు నవ్వొస్తుందని, క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న వాళ్లెవరూ అలా మాట్లాడరని విమర్శకులను ఉద్దేశించి ఫైరయ్యాడు.  


కాగా,  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణంగా  ఓటమిపాలైనప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-1 తేడాతో సిరీస్‌ విజయాన్నందుకుని చరిత్ర సృష్టించింది. టీమిండియా తొలి టెస్ట్‌లో ఓటమిపాలయ్యాక వ్యక్తిగత కారణాల చేత(భార్య అనుష్క శర్మ డెలివరీ కోసం) విరాట్ కోహ్లి సిరీస్‌ నుంచి వైదొలగగా రహానే జట్టును ముందుండి విజయపథంలో నడిపించాడు. అడిలైడ్‌ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారధ్యంలో టీమిండియా రెండో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. అనంతరం మూడో టెస్ట్‌ డ్రా కాగా, సిరీస్‌ డిసైడర్‌ అయిన కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఆ సిరీస్ ముగిశాక చాలా  కార్యక్రమాలలో రవిశాస్త్రి.. గెలుపు కారణం తనేనని గొప్పలు చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ప్రముఖ క్రీడా జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ రహానే ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. 
చదవండి: IPL 2022 Auction: పర్సులో ఇంకా 62 కోట్లు.. అలాంటి వారినే కొనుక్కుంటాం: కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు