Rybakina Vs Sabalenka: ఫైనల్‌కు దూసుకెళ్లిన రిబాకినా.. సబలెంకాతో పోరుకు సై

27 Jan, 2023 10:45 IST|Sakshi
సబలెంకా

Elena Rybakina Vs Aryna Sabalenka In Final- మెల్‌బోర్న్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించనుంది. గత ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గి వెలుగులోకి వచ్చిన కజకిస్తాన్‌ అమ్మాయి ఎలీనా రిబాకినా... కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన సబలెంకా (బెలారస్‌) మధ్య శనివారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరు జరగనుంది.

మాజీ నంబర్‌ వన్‌కు షాకిచ్చి
గురువారం జరిగిన రెండు సెమీఫైనల్స్‌లో 22వ సీడ్‌ రిబాకినా 7–6 (7/4), 6–3తో 2012, 2013 చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌)ను ఓడించగా... ఐదో సీడ్‌ సబలెంకా 7–6 (7/1), 6–2తో అన్‌సీడెడ్‌ మగ్దా లీనెట్‌ (పోలాండ్‌)పై విజయం సాధించింది. కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న సబలెంకాకిది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కానుండగా... రిబాకినా కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తుది పోరుకు చేరింది.  

ఇక అజరెంకాతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తొమ్మిది ఏస్‌లు, 30 విన్నర్స్‌ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు అజరెంకా మూడు ఏస్‌లు కొట్టి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేసింది. అజరెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన రిబాకినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది.

  

సబలెంకా ముందు నిలవలేకపోయిన లీనెట్‌
తన కెరీర్‌లో 30వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన లీనెట్‌ కీలకపోరులో సబలెంకాకు సరైన సమాధానమివ్వలేకపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లీనెట్‌ తొలి సెట్‌లో గట్టిపోటీనిచ్చినా రెండో సెట్‌లో డీలా పడింది. మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఏకంగా 33 విన్నర్స్‌ కొట్టింది.

సబలెంకాదే పైచేయి
మూడుసార్లు లీనెట్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకుంది. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సెమీఫైనల్‌ చేరి ఓడిపోయిన సబలెంకా నాలుగో ప్రయత్నంలో సఫలమై ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. రిబాకినాతో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఖచనోవ్‌ (రష్యా)తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)... టామీ పాల్‌ (అమెరికా)తో జొకోవిచ్‌ (సెర్బియా) ఆడతారు.  
చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే! టాస్‌ గెలిస్తే...

మరిన్ని వార్తలు