బెంబేలెత్తించిన బంగ్లాదేశ్‌.. ఆస్ట్రేలియా చిత్తుచిత్తు

10 Aug, 2021 04:53 IST|Sakshi

పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఇదే అత్యల్ప స్కోరు

ఐదో టి20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకున్న బంగ్లాదేశ్‌

ఢాకా: సీనియర్ల గైర్హాజరీలో అంతగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు దారుణ ప్రదర్శనతో సిరీస్‌ను ముగించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో (టి20, వన్డేలు) ఆ్రస్టేలియాకిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌ ముందువరకు కూడా 2005లో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. చివరి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్‌ సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.


టి20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్‌ ఓటమి. గత నెలలో విండీస్‌ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో ఓడింది. తొలుత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల చేసింది. ఓపెనర్‌ మొహమ్మద్‌ నైమ్‌ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌటై ఓడింది. తాత్కాలిక సారథి వేడ్‌ (22 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), బెన్‌ మెక్‌డెర్మట్‌ (16 బంతుల్లో 17; 1 సిక్స్‌) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబుల్‌ హసన్‌ (4/9), సైఫుద్దీన్‌ (3/12) ప్రత్యర్థిని పడగొట్టారు. సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌తో షకీబ్‌ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో లసిత్‌ మలింగ (107) అగ్రస్థానంలో ఉన్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు