ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా

4 Feb, 2021 05:13 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్‌ ప్రొటోకాల్‌ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి సన్నాహకంగా మెల్‌బోర్న్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్‌బోర్న్‌లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌లో ఓ కార్మికుడికి కోవిడ్‌–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్‌లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్‌ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు