ఎదురులేని ఆస్ట్రేలియా

31 Mar, 2022 05:13 IST|Sakshi

ఏడోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి

సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై 157 పరుగులతో ఘనవిజయం

అలీసా హీలీ సెంచరీ

వెల్లింగ్టన్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. లీగ్‌ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా సెమీఫైనల్లోనూ గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసుకోవడం విశేషం.

వర్షం అంతరాయం కలిగించడంతో 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 45 ఓవర్లలో 3 వికెట్లకు 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ అలీసా హీలీ (129; 17 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేయగా... రాచెల్‌ హేన్స్‌ (100 బంతుల్లో 85; 9 ఫోర్లు) ఆకట్టుకుంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 216 పరుగులు జోడించారు. చివర్లో బెత్‌ మూనీ (43 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆసీస్‌ స్కోరు 300 దాటింది. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా ఆడుతుంది. 

మరిన్ని వార్తలు