చెత్త ఫీల్డింగ్‌పై సన్నీ సెటైర్లు

18 Dec, 2020 17:09 IST|Sakshi

అడిలైడ్‌ : టీమిండియా చెత్త ఫీల్డిండ్‌పై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తన దైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లు జారవిడిచారు. దీనిపై సునీల్‌ గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా ఆటగాళ్ల వరస్ట్‌ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాకు వారం ముందుగానే క్రిస్‌మస్‌ పండుగ వచ్చిందని ఎద్దేవా చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌లో మార్నస్‌ లబుషేన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా నేలపాల్జేశాడు. దీనిపై గావస్కర్‌ స్పందిస్తూ.. క్రిస్‌మస్‌ మూడ్‌లో ఉన్న భారతీయులు వారం ముందుగానే బహుమతులు పంచిపెట్టారని వ్యాఖ్యానించాడు.
(చదవండి: పృథ్వీ షా ఏందిది?)

12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో లబుషేన్‌ క్యాచ్‌ను జస్‌ప్రీత్‌ బుమ్రా జారవిడిచాడు. భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్‌పై మరింత ఒత్తిడి పెంచే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అయితే, అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా సమష్టిగా రాణించడంతో చివరకు తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియాను టీమిండియా కట్టడి చేయగలిగింది. 191 పరుగుల వద్ద ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. అశ్విన్‌ 4, ఉమేశ్‌ యాదవ్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్‌ రనౌటయ్యాడు. కెప్టెన్‌ పైన్‌(73) ఒంటరి పోరాటం చేసి నాటౌట్‌గా నిలిచాడు.
(చదవండి: ఆసీస్ 191 ఆలౌట్‌, అశ్విన్‌ సక్సెస్‌)

మరిన్ని వార్తలు