కీలక వికెట్లు కూల్చిన సిరాజ్‌‌.. బుమ్రా ఆలింగనం

18 Jan, 2021 14:27 IST|Sakshi
సిరాజ్‌ను అభినందిస్తున్న టీమిండియా(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

బ్రిస్బేన్‌: టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన అతడి ప్రతిభను క్రికెట్‌ అభిమానులు కొనియాడుతున్నారు. స్థానిక గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 294 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. 21/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన  హైదరాబాదీ,  ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు.

వీరితో పాటు హాజల్‌వుడ్‌, స్టార్క్‌ను అవుట్‌ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందుకు తోడు శార్దూల్‌ ఠాకూర్‌ (4), వాషింగ్టన్‌ సుందర్‌(1) మెరుగ్గా రాణించడంతో ఆతిథ్య జట్టును కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో  సహచర ఆటగాళ్ల నుంచి సిరాజ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జస్ప్రీత్‌ బుమ్రా అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ప్రశంసిస్తున్న వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది. ‘‘తొలిసారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన  మహ్మద్‌ సిరాజ్‌కు స్టాండింగ్‌ ఓవియేషన్‌’’ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా సిరాజ్‌ ఆసీస్‌ టూర్‌లో ఉన్న సమయంలోనే అతడి తండ్రి  మొహమ్మద్‌ గౌస్‌ (53)మరణించిన విషయం విదితమే.(చదవండి: ఆసీస్‌ ఆలౌట్‌, భారత్‌కు భారీ టార్గెట్‌

ఈ క్రమంలో బీసీసీఐ అతడికి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించినప్పటికీ సంప్రదాయ క్రికెట్‌ ఆడాలన్న తన తండ్రి కలను నెరవర్చేందుకు అతడు అక్కడే ఉండిపోయాడు. ఇక టీమిండియా స్టార్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్ గైర్హాజరీ నేపథ్యంలో బాక్సింగ్‌ డే టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఈ యువ పేసర్‌ మెరుగ్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేక్షకులు పలుమార్లు జాతి వివక్ష వ్యాఖ్యలతో అతడిని కించపరిచినప్పటికీ, ఆత్మవిశ్వాసం చెదరనీయకుండా బంతితో సత్తా చాటుతూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు