జోరుగా భారత్‌ ప్రాక్టీస్‌

25 Dec, 2020 05:52 IST|Sakshi

రేపటినుంచి ఆసీస్‌తో రెండో టెస్టు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత జట్టు కోలుకునే ప్రయత్నంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. జట్టు ఆటగాళ్లంతా గురువారం కూడా తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ‘కన్‌కషన్‌’నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజా బ్యాట్‌ పట్టుకొని వికెట్ల మధ్య పరుగు తీస్తూ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నంలో పడగా...యువ బౌలర్‌ నటరాజన్‌ తన పదునైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. రహానే, పుజారాలు అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. రాహుల్, పంత్‌ కూడా ఎక్కువ సమయం నెట్స్‌లో చెమటోడ్చారు. చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ భారత ప్రాక్టీస్‌ సెషన్‌ను పర్యవేక్షించారు. అనంతరం రాహుల్, పృథ్వీషాలకు తగు సూచనలిచ్చిన రవిశాస్త్రి... కెప్టెన్‌ రహానేతో సుదీర్ఘ సమయం పాటు చర్చించాడు.  

మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు?
టెస్టు సిరీస్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం మూడో టెస్టు జనవరి 7నుంచి సిడ్నీలో జరగాల్సి ఉంది. అయితే నగరంలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణ       సందేహంలో పడింది. ఇలాంటి స్థితిలో అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టును నిర్వహిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాల్సి వచ్చిందని... మెల్‌బోర్న్‌లోనే   రెండో టెస్టు ముగిసేలోపు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు