ఆసీస్‌ అదుర్స్‌... 

4 Oct, 2020 02:56 IST|Sakshi

మహిళల జట్టు వరుసగా 19వ విజయం

బ్రిస్బేన్‌: టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌ జట్టుకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. తదుపరి రెండు వన్డేల్లోనూ గెలిస్తే 2003లో 21 వరుస విజయాలతో రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును మహిళల జట్టు సమం చేస్తుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ 181 పరుగుల విజయలక్ష్యాన్ని 33.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (70 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... ఓపెనర్లు రాచెల్‌ హేన్స్‌ (62 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్‌), అలీసా హీలీ (27 బంతుల్లో 26; 5 ఫోర్లు) రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్‌ జట్టు 49.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కేటీ పెర్కిన్స్‌ (32; 3 ఫోర్లు), మ్యాడీ గ్రీన్‌ (35; 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జార్జియా, జెస్సికా, సోఫీ మోలినెక్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు