INDw Vs AUSw: ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి

10 Oct, 2021 10:02 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌: చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో విజయానికి చేరువగా వచ్చినా...  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తహ్లియా మెక్‌గ్రాత్‌  (33 బంతుల్లో 42 నాటౌట్‌; 6 ఫోర్లు) జోరుతో చివరకు భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. మెక్‌గ్రాత్‌ ఫోర్లతో విరుచుకుపడటంతో కష్టమనుకున్న విజయాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆ్రస్టేలియా అందుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టుపై ఆ్రస్టేలియా మహిళల టీమ్‌ 4 వికెట్లతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధ్యింలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. పూజా వస్త్రకర్‌ (26 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. వర్షంతో రద్దయిన తొలి టి20లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌... ఇక్కడ మాత్రం తేలిపోయింది. స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిగ్స్‌ (7) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (20 బంతుల్లో 28; 5 ఫోర్లు) దూకుడుగా ఆడినా అనవసరపు షాట్‌కు ప్రయతి్నంచి స్టంపౌట్‌గా వెనుదిరిగింది.  చివర్లో పూజ జోరుతో  భారత్‌ 100 మార్కును అందుకుంది.  

ఆ రెండు ఓవర్లు... 
స్వల్ప ఛేదనలో ఆ్రస్టేలియా కూడా మొదట్లో తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... అలీసా హీలీ (4), కెపె్టన్‌ మెగ్‌ లానింగ్‌ (15), గార్డ్‌నెర్‌ (1), ఎలైస్‌ పెర్రీ (2) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌... బెత్‌ మూనీ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు)తో కలిసి జట్టును ఆదుకుంది. రాజేశ్వరీ గైక్వాడ్‌ తన వరుస ఓవర్లలో మూనీని, క్యారీ (7)లను అవుట్‌ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దాంతో ఆసీస్‌ విజయం కోసం చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేయాలి. శిఖా పాండే వేసిన 18వ ఓవర్‌లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు... రేణుక సింగ్‌ వేసిన 19వ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 13 పరుగులను ఆసీస్‌ రాబట్టింది. 20వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌ తీసిన మెక్‌గ్రాత్‌ ఆసీస్‌కు గెలుపును ఖాయం చేసింది. నేడు ఇక్కడే చివరి టి20 జరగనుంది. 

చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

>
మరిన్ని వార్తలు