వన్డే క్రికెట్‌లో నయా వరల్డ్‌ రికార్డు

4 Apr, 2021 14:26 IST|Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌: వన్డే క్రికెట్‌ చరిత్రలో నయా వరల్డ్‌ రికార్డు లిఖించబడింది. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ఆల్‌టైమ్‌ రికార్డును ఆస్ట్రేలియా మహిళల జట్టు నమోదు చేసింది. న్యూజిలాండ్‌ మహిళలతో జరిగిన వన్డేలో ఆసీస్‌ మహిళలు 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితంగా అత్యధికంగా 22వరుస విజయాలు సాధించిన జట్టుగా కొత్త చరిత్రను నెలకొల్పారు. ఈ క్రమంలోనే 2003 సీజన్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు సాధించిన వరుస వన్డే విజయాల రికార్డును అదే దేశానికి మహిళలు జట్టు బ్రేక్‌ చేసింది.  రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు వరుసగా 21 వన్డే విజయాలు సాధించగా, అది ఇప్పటివరకూ వరల్డ్‌ రికార్డుగా ఉంది. దాన్ని ఆసీస్‌ మహిళలు సవరించడం విశేషం.

ఆసీస్‌ మహిళల జట్టు  2017, అక్టోబర్‌లో చివరిసారి వన్డేలో ఓటమి పాలు కాగా, ఆ తర్వాత వరుసగా విజయాలను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. 2018 మార్చి నుంచి ఆసీస్‌ ఈ వరుస విజయాలను సాధించింది. భారత్‌లో ఆ ఏడాది జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్‌ మహిళలు 3-0తో కైవసం చేసుకోగా, ఆపై పాకిస్తాన్‌తో 3-0తో మరొక సిరీస్‌ను దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక ఇలా వరుసగా మూడు వన్డేల సిరీస్‌లను ఆసీస్‌ మహిళలు సాధించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించారు. ఇది మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో న్యచూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. లారెన్‌ డౌన్‌(90) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్‌ బౌలర్లలో ష్కట్‌ నాలుగు వికెట్లు సాధించగా,  నికోలా కారే మూడు వికెట్లు తీశారు. అనంతరం  213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ మహిళలు 38.3 ఓవర్లలో విజయం సాధించారు. అలెసా హీలే(65), ఎలీస్‌ పెర్రీ(56 నాటౌట్‌), ఆష్లే గార్డెనర్‌(53 నాటౌట్‌)లు రాణించి ఇంకా పది ఓవర్లకు పైగా మిగిలి ఉండగా విజయాన్ని అందించారు.   

ఇక్కడ చదవండి: 'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్‌ ఆడితే బాగుండేది'

'మేం సీఎస్‌కేకు ఆడలేం'.. కారణం అదేనట

మరిన్ని వార్తలు