ఆసీస్‌ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో సహచర క్రికెటర్లు

12 Jul, 2021 15:45 IST|Sakshi

లండన్‌: అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. తొలుత ఇంగ్లండ్‌ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడగా, ఆతర్వాత శ్రీలంక ఆటగాడు వీరక్కోడి, తాజాగా ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ మహమ్మారి బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న హాండ్స్‌కాంబ్‌.. మిడిల్‌సెక్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హాండ్స్‌కాంబ్‌ తన తదుపరి మ్యాచ్‌లో లీస్టర్‌షైర్‌తో తలపడాల్సి ఉంది. అయితే, రెగ్యులర్‌గా నిర్వహించే పరీక్షల్లో భాగంగా అతడికి కోవిడ్‌ టెస్ట్‌ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని సహచర క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు.

దీంతో అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని మిడిల్‌సెక్స్‌ యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో ఐరిష్‌ ఆటగాడు టిమ్‌ ముర్తగ్‌ సారథిగా ఎంపిక చేసింది. కాగా, 2019 జనవరిలో చివరి సారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకి ఆడిన హ్యాండ్స్‌కబ్.. అదే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌పై బెంగళూరు వేదికగా చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత అదే ఏడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతనికి ఆఖరి సిరీస్‌. 

2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్స్‌కబ్.. ఆసీస్‌ తరఫున 16 టెస్టులు, 22 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మూడు సెంచరీలు నమోదు చేసిన హ్యాండ్స్‌కాంబ్.. ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు క్రికెటర్లు సహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఆతర్వాత వీరితో తలపడిన శ్రీలంక బృందంలో బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌, శ్రీలంక రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాడు వీరక్కోడికి పాజిటివ్‌ అని తేలింది. 

మరిన్ని వార్తలు