Shane Warne Death: ‘షేన్‌ వార్న్‌ది సహజ మరణమే’

8 Mar, 2022 00:26 IST|Sakshi
ఆస్ట్రేలియా రాయబారికి వార్న్‌ పోస్ట్‌మార్టమ్‌ వివరాలు తెలుపుతున్న థాయ్‌లాండ్‌ పోలీసులు

ధ్రువీకరించిన థాయ్‌లాండ్‌ పోలీసులు

ఎంసీజీలో అంత్యక్రియలకు ఏర్పాట్లు   

మెల్‌బోర్న్‌: స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మృతి విషయంలో అనుమానించాల్సిన అంశమేమీ లేదని తేలింది. అతనిది సహజ మరణమేనని, గుండె పోటు కారణంగానే చనిపోయినట్లు థాయ్‌లాండ్‌ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వార్న్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన వైద్యుడు థాయ్‌ పోలీసులకు నివేదిక ఇవ్వగా, దానిని వారు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి అందజేశారు. ‘వార్న్‌ మృతికి సంబంధించి సందేహించాల్సిన అంశాలేమీ కనపడలేదు. ఇది హత్య కాదు. అతను సహజంగానే చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్‌ చేసిన డాక్టర్‌ వెల్లడించారు.

అంతకుముందే తనకు ఛాతీలో కొంత నొప్పి వస్తోందని, థాయ్‌లాండ్‌ నుంచి తిరిగి రాగానే వైద్యులను కలుస్తానని వార్న్‌ తన తండ్రితో కూడా చెప్పాడు’ అని అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సురచటే హక్‌పర్న్‌ స్పష్టం చేశారు. మరోవైపు సెలవుల కోసం థాయ్‌లాండ్‌ వెళ్లడానికి ముందే వార్న్‌ ఛాతీ నొప్పితో బాధపడినట్లు, అతని డైట్‌లో మార్పు కూడా అందుకు కారణం కావచ్చని వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కైన్‌ వెల్లడించాడు. ‘బరువు తగ్గే క్రమంలో వార్న్‌ కఠోర ఆహార నియమాలను అలవాటు చేసుకున్నాడు. థాయ్‌ వెళ్లే ముందు రెండు వారాలుగా అతను కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు. అతను తన జీవితంలో చాలా ఎక్కువగా ధూమపానం చేసేవాడు. బహుశా అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చేమో’ అని అతను వివరించాడు.  

అధికారిక లాంఛనాలతో...
వార్న్‌ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్‌ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్‌ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు.

దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్, విక్టోరియా ముఖ్యమంత్రి డానియెల్‌ ఆండ్రూస్‌ అంత్యక్రియలకు హాజరవుతారు. ‘ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్‌ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్‌ ఆవేదనగా చెప్పగా... ‘నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి’ అంటూ అతని కుమారుడు జాక్సన్‌ తన బాధను వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్‌ నుంచి వార్న్‌ మృతదేహం ఇంకా అతని ఇంటికి చేరలేదు.

>
మరిన్ని వార్తలు