ఎట్టకేలకు సొంతగడ్డపై...

18 May, 2021 05:51 IST|Sakshi

స్వదేశం చేరుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

సిడ్నీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్‌నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్‌ సీషెల్స్‌’ ఫ్లయిట్‌ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) వెల్లడించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్‌ మైక్‌ హస్సీ కూడా విడిగా ఖతర్‌ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్‌ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

>
మరిన్ని వార్తలు