Australian Open 2023: శ్రమించి... శుభారంభం

17 Jan, 2023 05:25 IST|Sakshi

రెండో రౌండ్‌లోకి రాఫెల్‌ నాదల్‌

తొలి రౌండ్‌లో 3 గంటల 41 నిమిషాల్లో బ్రిటన్‌ ప్లేయర్‌పై గెలుపు

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌కు తొలి రౌండ్‌లోనే గట్టిపోటీ ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 40వ ర్యాంకర్‌ జాక్‌ డ్రేపర్‌తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రాఫెల్‌ నాదల్‌ 7–5, 2–6, 6–4, 6–1తో నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నాదల్‌ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

ఏకంగా 46 అనవసర తప్పిదాలు చేసిన నాదల్‌ 41 విన్నర్స్‌ కొట్టి పైచేయి సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న డ్రేపర్‌ 13 ఏస్‌లతో అదరగొట్టాడు. అయితే 46 అనవసర తప్పిదాలు చేయడం... కీలకదశలో తడబడటంతో డ్రేపర్‌కు ఓటమి తప్పలేదు. నాదల్‌ సర్వీస్‌ను 11 సార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా డ్రేపర్‌ నాలుగుసార్లు మాత్రమే   సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు నాదల్‌ ఆరుసార్లు డ్రేపర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు.    

మెద్వెదెవ్‌ అలవోకగా...
పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఆరో సీడ్‌ ఫీలిక్స్‌ అలియాసిమ్‌ (కెనడా), పదో సీడ్‌ హుబెర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మెద్వెదెవ్‌ 6–0, 6–1, 6–2తో మార్కోస్‌ గిరోన్‌ (అమెరికా)పై, సిట్సిపాస్‌ 6–3, 6–4, 7–6 (8/6)తో క్వెంటిన్‌ హేల్స్‌ (ఫ్రాన్స్‌)పై, అలియాసిమ్‌ 1–6, 7–6 (7/4), 7–6 (7/3), 6–3తో పోస్‌పిసిల్‌ (కెనడా)పై, హుర్కాజ్‌ 7–6 (7/1), 6–2, 6–2తో పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై గెలిచారు. అయితే 2014 చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 4 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/3), 3–6, 6–1, 6–7 (2/7), 4–6తో అలెక్స్‌ మొల్కాన్‌ (స్లొవేకియా) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్‌ బొర్నా చోరిచ్‌ (క్రొయేషియా) 3–6, 3–6, 3–6తో జిరీ లెహెక్సా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో... ప్రపంచ 19వ ర్యాంకర్‌ ముసెట్టి (ఇటలీ) 4–6, 1–6, 7–6 (7/0), 6–2, 6–7 (4/10)తో హ్యారిస్‌ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయారు.

స్వియాటెక్‌ కష్టపడి...
మహిళల సింగిల్స్‌ విభాగం తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) గంటా 59 నిమిషాల్లో 6–4, 7–5తో జూల్‌ నెమియర్‌ (జర్మనీ)పై శ్రమించి గెలిచింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ పెగూలా (అమెరికా) 6–0, 6–1తో జాక్వెలిన్‌ (రొమేనియా)పై, ఆరో సీడ్‌ సాకరి (గ్రీస్‌) 6–1, 6–4తో యు యువాన్‌ (చైనా)పై, ఏడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచారు.
 

మరిన్ని వార్తలు