Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్‌

19 Jan, 2022 07:52 IST|Sakshi

    ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ రెండో రౌండ్‌లోకి బ్రిటన్‌ టీనేజర్‌     

Australia Open 2022: గత ఏడాది క్వాలిఫయర్‌ హోదాలో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్‌ టీనేజర్‌ ఎమ్మా రాడుకాను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న రాడుకాను మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 6–0, 2–6, 6–1తో 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపి యన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై గెలిచింది.    

లేలా అవుట్‌... 
మరోవైపు గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ రన్నరప్‌ లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. 23వ సీడ్‌ లేలా 4–6, 2–6తో ఇంగ్లిస్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. 2019 రన్నరప్, 20వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 2–6, 2–6తో సొరానా క్రిస్టియా (రొమేనియా) చేతిలో... 2016 చాంపియన్, 16వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 4–6, 3–6తో కయా కనెపి (ఎస్తోనియా) చేతిలో పరాజయం పాలయ్యారు.  రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌), ఆరో సీడ్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా), ఏడో సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.   

గట్టెక్కిన ముర్రే... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే ఐదు సెట్‌ల పోరాటంలో గట్టెక్కి 2017 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరాడు. ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన ముర్రే 3 గంటల 52 నిమిషాల్లో 6–1, 3–6, 6–4, 6–7 (5/7), 6–4తో 21వ సీడ్‌ బాసిలాష్‌విలి (జార్జియా)పై గెలిచాడు. రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) కూడా తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 

మరిన్ని వార్తలు