చేజారిన ఆశలు ‌: సెరెనా భావోద్వేగం

18 Feb, 2021 11:57 IST|Sakshi

పైనల్‌ రేసునుంచి తప్పుకున్న అమెరికా స్టార్‌ టెన్నిస్‌ స్టార్‌

ఒసాకా చేతిలో ఓడిపోయిన  సెరెనా

సెరెనా భావోద్వేగం

గెలవాల్సిన  మ్యాచ్‌.. తప్పులు చేశా

సాక్షి, న్యూఢిల్లీ:  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అమెరికా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి  నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలయ్యారు.  రాడ్ లావర్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో ఆమె ఓడిపోయారు. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఈ ఓటమికి తన తప్పిదాలే కారణమని ఒప్పుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ 24 వ టైటిల్‌ను గెలుచుకుని రికార్టు సృష్టిస్తారని భావించారు. కానీ అనూహ‍్య ఓటమితో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ప్రయాణం ముగిసింది. అయితేఈ సందర్భంగా సెరెనా  టెన్నిస్‌కు వీడ్కోలు చెపుతారా అనే చర్చ తీవ్రమైంది. 

నిజానికి ఇది తాను గెలవాల్సిన మ్యాచ్‌ అంటూ సెరెనా విలియమ్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో టెన్నిస్‌కు గుడ్‌ బై చెప్పనున్నారా అన్న ప్రశ్నకు  కన్నీటి పర్యంతమైన ఆమె అకస్మాత్తుగా సమావేశంనుంచి నిష్క్రమించడం అందరినీ విస్మయ పర్చింది. ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిట్‌ దక్కించుకున్న సెరెనా  పైనల్‌ రేసునుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. నాకు తెలియదు..ఆసీస్‌ ప్యాన్స్‌ ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉందని సమాధానమిచ్చారు. కానీ ఒకవేళ తాను వీడ్కోలు చెప్పాల్సి వస్తే..ఎవరికీ చెప్పను... ఐయామ్‌ డన్‌ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్‌లో​ నాల్గవ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌కోసం  జెన్నిఫర్ బ్రాడి లేదా కరోలినా ముచోవాతో ఒసాకా తలపడాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు