ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆ దేశ ఆటగాళ్లు దూరం..? 

26 May, 2021 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా మారింది. ఈ పర్యటనలో ఆసీస్ ఐదు టీ20లు ఆడనుండగా, సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 13 మంది ఆసీస్ స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరంతా లీగ్‌కు దూరమైతే టోర్నీ కళావిహీనంగా మారుతుంది. గాయాల బారినపడి ఇది వరకే చాలా మంది స్టార్లు లీగ్‌కు దూరం కాగా, కొత్తగా వీరు కూడా అందుబాటులో ఉండకపోతే, లీగ్ పునఃప్రారంభించి ఉపయోగం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్ పర్యటన విషయమై బీసీసీఐ..  క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా పర్యటనను రద్దు చేసేలా చేస్తుందని పలువురు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు గట్టిగా నమ్ముతున్నారు.    

కాగా, కరోనా కారణంగా అర్దంతరంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబ‌ర్ 15 నుంచి అక్టోబ‌ర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. లీగ్ నిర్వహణపై మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్..

మరిన్ని వార్తలు