ఆసీస్‌ వికెట్‌ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు

7 Jun, 2021 20:44 IST|Sakshi

అబుదాబీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్‌) ఆరవ సీజన్‌ పునఃప్రారంభానికి ముందు లాహోర్ ఖలందర్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్, ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ డంక్ ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అబుదాబిలో క్యాచ్ ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ముఖానికి బలంగా తాకడంతో పెదవులపై ఏకంగా ఏడు కుట్లు పడ్డాయి. దీంతో అతను శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

లాహోర్‌ ఖలందర్స్‌ జట్టులో డంక్‌ కీలక ఆటగాడు కావడంతో ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం పడనుందని ఆ ఫ్రాంఛైజీ సీఈఓ సమిన్ రానా పేర్కొన్నాడు. పీఎస్‌ఎల్‌ 2021 తొలి భాగంలో డంక్‌.. 40 సగటుతో 80 పరుగులు సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగలతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా వాయిదా పడిన పీఎస్‌ఎల్‌ యూఏఈ వేదికగా జూన్ 9 నుంచి పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

పీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం ఖలందర్స్‌ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టులో పాకిస్తాన్ స్టార్‌ ఆటగాళ్ళు షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, హరిస్ రౌఫ్‌తో పాటు విదేశీ స్టార్లు రషీద్ ఖాన్, డేవిడ్ వీజ్, సమిత్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉంటే, బెన్ డంక్ ఆస్ట్రేలియా తరఫున ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఏళ్ల డంక్‌.. 2014 నవంబర్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. 
చదవండి: డబ్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాకు కష్టమే..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు