Steffan Nero: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ క్రికెటర్‌.. వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ నమోదు

16 Jun, 2022 20:16 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ బ్యాటర్‌ స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. టీ20ల ప్రభావం కారణంగా వన్డేల్లో డబుల్‌ హండ్రెడ్‌ చేయడమే గగనమైన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెటర్‌ ట్రిపుల్‌ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

వివరాల్లోకి వెళితే.. కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ బ్యాటర్‌ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆసీస్‌ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కో్‌ర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్‌ కేవలం 272 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది.  

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నీరో..
అంధుల వన్డే క్రికెట్‌ చరిత్రలో ట్రిపుల్‌ సెంచరీ సాధించడం ద్వారా స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాక్‌ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్‌లో టాప్‌ స్కోర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మసూద్‌ జాన్‌ రికార్డు బద్దలైంది. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) సాధించడం విశేషం.

ఎనిమిదో ఆసీస్‌ క్రికెటర్‌గా రికార్డు..
కివీస్‌పై వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నీరో మరో రికార్డును కూడా తర ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. 
చదవండి: ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..!
 

మరిన్ని వార్తలు