Shane Warne: శవ పరీక్షకు వార్న్‌ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు

6 Mar, 2022 13:24 IST|Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ లోకాన్ని విడిచి రెండోరోజులు కావొస్తోంది. వార్న్‌ అకాల మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాగా థాయ్‌ అధికారులు ఆదివారం షేన్‌వార్న్‌ భౌతికకాయానికి అటాప్సీ (శవ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం కొరకు భౌతికకాయాన్ని ఉదయం ఆసుపత్రికి తరలించారు. 

ఇప్పటికే వార్న్‌ చనిపోయే ముందు ఎలాంటి ఆల్కాహాల్‌.. మత్తు పదార్థాలు తీసుకోలేదని వార్న్‌ మేనేజర్‌ చెప్పినట్లు థాయ్‌ పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అటాప్సీ రిపోర్టు ద్వారా బయటపడే అవకాశాలున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టుమార్టం అనంతరం వార్న్‌ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్‌ అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపింది. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. 


కుమారుడు జాక్సన్‌తో దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌

కాగా థాయ్‌లాండ్‌లోని కోయ్‌ సమూయ్‌ ప్రాంతంలోని తన విల్లాలో 52 ఏళ్ల వార్న్‌ అచేతనంగా పడి ఉండడం.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసినట్లు తెలిసింది. వార్న్‌ స్నేహితులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అతన్ని బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. వార్న్‌ మృతిపై అతని కుటుంబసభ్యులు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. తండ్రి మృతిపై అతని పెద్ద కుమారుడు బోరున విలపించాడు. జాక్సన్‌ మాట్లాడుతూ..'' నాన్న ఇంకా మా కళ్ల ముందు తిరుగుతున్నట్లే ఉంది.. మా ఇంటి డోర్‌ నుంచి లోపలికి వస్తు‍న్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇది చెడ్డ కల అయితే బాగుండు'' అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. 

ఇక వార్న్‌ 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు తన సేవలందించాడు. మొత్తంగా వార్న్‌ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు.

చదవండి: Shane Warne: వార్న్‌ మృతిపై థాయ్‌ పోలీసులు ఏమన్నారంటే..

Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి

>
మరిన్ని వార్తలు