విరాట్‌లో మార్పు తెచ్చిన పుస్తకం

12 Aug, 2020 10:23 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌

బుక్‌ ల్యాంప్‌ ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఏ యోగి

విరాట్‌ కోహ్లి... యంగ్‌ జెనరేషన్‌కు రోల్‌మోడల్‌. ఆయనకు బాగా నచ్చిన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఏ యోగి. ‘జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసిన పుస్తకం’ అని కోహ్లి అంటున్న ఈ పుస్తకంలో  ఏముంది?‘క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వీల కన్నా, జ్ఞానమార్గాన్ని అనుసరించే వారి కన్నా, కర్మమార్గాన్ని అనుసరించే వారికన్నా యోగి ఉన్నతుడుగా భావించబడతాడు. ఓ అర్జునా...నువ్వు యోగివి కమ్ము’ అంటూ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది.

పరమహంస యోగానంద (1893–1952) అచ్చంగా అలాంటి యోగి. ఆయన ఆత్మకథ ఈ పుస్తకం. యోగానంద అద్భుతమైన బాల్యానుభవాలు, జ్ఞాని అయిన ఒక గురువు కోసం యవ్వనంలో ఆయన చేసిన అన్వేషణలో తారసపడిన అనేకమంది సాధుసంతులతో జరిగిన విలువైన పరిచయాలు, దైవసాక్ష్యాత్కారం  పొందిన గురుదేవుల ఆశ్రమంలో పదిసంవత్సరాలు సాగిన శిక్షణా,  రెండు శరీరాలున్న సాధువులు, టైగర్‌స్వామి, నిద్రపోని సాధువు, గ్రహాల్ని ఓడించడం, సన్యాస స్వీకరణ, క్రియాయోగశాస్త్రం, యుక్తేశ్వర్‌ పునరుత్థానం, గాలిలో తేలే సాధువు, హిమాలయాల్లో మహాభవన సృష్టి, నిరాహార యోగిని, సనాతన భారతీయ ధ్యానప్రక్రియ విశ్వవ్యాప్తం చేసే కృషి...ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు పుస్తకంలో మనల్ని కట్టిపడేస్తాయి.

యోగుల గురించి ఒక యోగి స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. గోరఖ్‌పూర్‌లో పుట్టిన ముకుందలాల్‌ ఘోష్‌ పరమహంస యోగానందగా పరివర్తన చెందిన క్రమమే ఈ పుస్తకం. మనసు, ఆత్మకిటికీలు తెరిచే అద్భుతమైన పుస్తకం.

మరిన్ని వార్తలు