Asia Cup 2022: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్‌.. ఆవేశ్‌ స్థానంలో చాహర్‌ ఎంట్రీ..!

7 Sep, 2022 18:17 IST|Sakshi

Deepak Chahar Replaces Avesh Khan: ఆసియా కప్‌ 2022లో టీమిండియా పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. నిఖార్సైన ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేక సూపర్‌-4 దశలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని అయిపోయాక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతతో జట్టుకు దూరంగా ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో తదుపరి ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడబోయే మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పని సూపర్‌-4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

లంక చేతిలో ఓటమితో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన దశలో ఈ మార్పు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. జట్టు ఎంపికలో మున్ముందైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత సెలెక్టర్లను హెచ్చరిస్తున్నారు. జట్టులో కనీసం ముగ్గురు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు బ్యాటర్లు, బౌలర్లను కాకుండా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను కూడా సాన పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కనీసం ముగ్గురు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న దీపక్‌ చాహర్‌.. ఇటీవలే జింబాబ్వే సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే  3 వికెట్లతో రాణించాడు. చాహర్‌ జింబాబ్వే సిరీస్‌లో పర్వాలేదనిపించినా ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంతో టీమిండియా తగిన మూల్యమే చెల్లించుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చాహర్‌ను జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో దీపక్‌ చాహర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌లు స్టాండ్‌ బై ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే.  
చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్‌ బాయ్‌కాట్‌ చేస్తేనే..!

Poll
Loading...
మరిన్ని వార్తలు