కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం

18 Aug, 2023 16:31 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అధికారికంగా జాయిన్‌ అయ్యాడు. రేపు (ఆగస్ట్‌ 19) ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో సెయింట్‌ కిట్స్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ తరఫున సీపీఎల్‌ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు.

దీంతో ప్రవీణ్‌ తాంబే తర్వాత కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్‌లో ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరఫున సీపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

సీపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌కు ముందు రాయుడు తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ మెసేజ్‌ షేర్‌ చేశాడు.  మళ్లీ బ్యాట్‌ పట్టి బరిలోకి దిగడం​ అద్భుతంగా ఉంది.. కరీబియన్‌ లీగ్‌లో, ముఖ్యంగా సెయింట్‌ కిట్స్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్‌ జెర్సీలోని తన ఫోటోను షేర్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, 2023 సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్‌లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు