అలాంటి వారికి  ప్ర‌ద‌ర్శ‌న‌తోనే స‌మాధాన‌మివ్వాలి 

3 Sep, 2020 15:43 IST|Sakshi

క‌రాచీ : పాకిస్తాన్ టెస్టు జ‌ట్టు కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ తన స‌హ‌చ‌ర ఆట‌గాడైన సర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు మ‌ద్ద‌తునిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. స‌ర్ఫ‌రాజ్‌ను విమ‌ర్శించేవారిని ఏదో ఒక‌రోజు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తోనే స‌మాధాన‌మిస్తాడ‌ని తెలిపాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం పాకిస్తాన్ జ‌ట్టు ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌‌వారం ఇంగ్లండ్, పాక్‌ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీని తేలిగ్గా స్టంపింగ్ చేసే అవ‌కాశాన్ని జార‌విడిచాడు. దీంతో మొయిన్ అలీ 61 ప‌రుగుల‌తో జ‌ట్టు టాప్ స్కోరర్‌గా నిలిచి విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకువ‌చ్చాడు. కానీ చివ‌రికి 191 ప‌రుగులే చేసిన‌  ఇంగ్లండ్ జ‌ట్టు కేవ‌లం 5 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

దీంతో స‌ర్ఫ‌రాజ్‌ను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్ చేశారు. అలీని ఔట్ చేసే సువ‌ర్ణ‌వకాశాన్ని చేజేతులా మిస్ చేసిన స‌ర్ఫ‌రాజ్‌ను అంద‌రూ విమ‌ర్శించారు. అంతేగాక అత‌నిపై జోకులు కూడా పేల్చారు. దీనిపై స‌ర్ఫ‌రాజ్ త‌న ట్విట‌ర్‌లో త‌న‌ను విమ‌ర్శించిన వారినుద్దేశించి ఉర్ధూ భాష‌లో ఘాటుగాఏనే స్పందించాడు. స‌ర్ఫ‌రాజ్ చేసిన ట్వీట్‌కు తాను మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు టెస్టు జ‌ట్టు కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ పేర్కొన్నాడు. (చ‌ద‌వండి : వైజ్‌ కెప్టెన్‌ ఉన్నాడు.. వైస్‌ కెప్టెన్‌ ఎందుకు?)

'భ‌య్యా.. మీకు చాలా మంది అభిమానులున్నారు.. అందులో నేను కూడా ఒక‌డిని. నిన్ను విమ‌ర్శించేవారికి నీ ప్ర‌ద‌ర్శ‌న‌తోనే స‌మాధానం చెప్తావు. అల్లా కూడా ఎప్పుడు నీవెంటే ఉంటాడు. పాకిస్తాన్ జ‌ట్టుకు ఎన్నోసార్లు ఉప‌యోగ‌ప‌డ్డావు..  ఈ సిరీస్‌లో కూడా మంచి పాజిటివ్ ఎన‌ర్జీతో ఉన్నావు.. దానిని అలాగే కొన‌సాగించు.'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా  గ‌తంలో స‌ర్ఫ‌రాజ్ పాక్ జ‌ట్టుకు టీ20, టెస్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిచిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కెప్టెన్ ప‌ద‌వి పోయాకా త‌న నిరాశ‌జ‌న‌క‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టులో సుస్థిర స్థానం కోల్పోయాడు.

మరిన్ని వార్తలు