సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్‌ కెప్టెన్‌‌

14 Apr, 2021 14:44 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సత్తా చాటాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 865 పాయింట్లతో ముందు వరుసలో నిలిచాడు. కాగా 2017 నాటి నుంచి టాప్‌లో కొనసాగుతున్న రన్‌మెషీన్‌ కోహ్లి ప్రస్తుతం 857 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితం అయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లం​డ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో రెండు అర్ద శతకాలతో రాణించిన కోహ్లి.. ర్యాంకింగ్స్‌లో 1258 రోజుల పాటు అగ్రస్థానాన్ని కాపాడుకోగలినప్పటికీ, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బాబర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడటంతో నంబర్‌ వన్‌ ర్యాంకు కోల్పోక తప్పలేదు.


ఫొటో కర్టెసీ: ఐసీసీ

ఇక బాబర్‌, కోహ్లి తర్వాత టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (825), కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌(801), ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌(791) పాయింట్లతో టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్‌ మరో ఆటగాడు ఫకార్‌ జమాన్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌లో 302 పరుగులతో రాణించడంతో ఏకంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. కాగా మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం పాకిస్తాన్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను పాక్‌ కైవసం చేసుకోగా, కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

చదవండి: మరోసారి విలియమ్సన్‌కే... 
ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు..

మరిన్ని వార్తలు